హైదరాబాద్‌లో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దీంతో గ్రేటర్ నగరం (Greater Hyderabad) మత్తు పదార్థాలకు (Intoxicants) అడ్డగా మారిందని మరోసారి రుజువైంది. ఇప్పటికే నగరంలోని చాలా వరకు హోటల్స్, పబ్బులు, రిసార్ట్స్‌లో మత్తు పదార్థాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. నగరంలోని ఫేమస్ హోటల్ ‘రాడిసన్ బ్లూ’కు సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులోని ఏడీఏ బొల్లారంలో మాదకద్రవ్యాల కంట్రోల్ అధికారులు మత్తు పదార్థాల ముఠా గుట్టు రట్టు చేశారు. ఇంటర్ పోల్ సమాచారం మేరకు స్టేట్ మాదకద్రవ్యాల కంట్రోల్ అధికారులు శుక్రవారం బొల్లారంలో దాడులు నిర్వహించారు.
ఈ సోదాల్లో భాగంగా బొల్లారంలోని ఒక కంపెనీలో 90 కిలోల (90KGS) మెపిడ్రిన్‌ను(Mepidrin) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మెపిడ్రిన్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.9 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. బొల్లారంం పరిధిలో పదేళ్లుగా మత్తుపదార్థాల దందా చేస్తున్న కస్తూరిరెడ్డి.. సిగరేట్ ప్యాకెట్ల మాటున విదేశాలకు మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌లోనూ నిందితుడు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఏపీలో గురువారం వైజాగ్ పోర్టులో 25,000 కేజీల మాదకద్రవ్యాలను సీబీఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దేశంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల కంటైనర్ అని అధికారులు పేర్కొన్నారు. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు పేరిట కంటైనర్ డెలీవరీ అవ్వగా..ఆ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.వీరికి బీజేపీ, టీడీపీతో సంబంధాలున్నాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.