రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాను చేస్తున్న డిమాండ్లను సీఎం పట్టించుకోవడం లేదంటూ సంగోడ్ ఎమ్మెల్యే భరత్ సింగ్ గుండు గీయించుకున్నారు. అనంతరం ఆ వెంట్రుకలతో పాటు ఓ లేఖను సీఎం గెహ్లాట్ కు పంపించారు.
సీఎం గెహ్లాట్ విశ్వాసం కోల్పోయారని ఆయన మండిపడ్డారు. అందుకే గుండు గీయించుకుని వెంట్రుకలు పంపుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ప్రమోద్ భయ చేస్తున్న అవినీతికి సీఎం బహిరంగంగా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఖాన్ కీ జోప్రియా గ్రామాన్ని కోట జిల్లాలొ చేర్చలేదని ఆయన ఫైర్ అయ్యారు. గాంధేయ వాదిగా చెప్పుకునే గెహ్లాట్ కు ఇది సరికాదన్నారు.
పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వచ్చానన్నారు. సుదీర్ఘ కాలంగా వాటిని సీఎం పరిష్కరించడం లేదన్నారు. సీఎం మీద తనకు గౌరవం చనిపోయిందన్నారు. అందుకే నిరసనగా తాను గుండు గీయించుకుని ఆ వెంట్రుకలను పంపుతున్నానని లేఖలో తెలిపారు. తాను పంపుతున్న బహుమతిని తీసుకోవాలని సీఎంను కోరారు.
పాలకులపై చాలా ఒత్తిళ్లు ఉండవచ్చన్నారు. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడూ గాంధీ సిద్దాంతాల గురించి మాట్లాడతారన్నారు. గాంధీ తన జీవితంలో ఎఫ్పుడూ సత్యాన్నే పలికారన్నారు. సీఎంపై గౌరవం చనిపోయిందన్నారు. మన సమాజంలో ఎవరైనా చనిపోతే వారి బంధువులు గుండు చేయించుకోవడం మన సంస్కృతిలో భాగమన్నారు. సీఎం గౌరవం చనిపోవడంతో తాను గుండు చేయించుకున్నట్టు మాజీ మంత్రి వివరించారు.