పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు దాడులను తీవ్రతరం చేశారు. ముఖ్యంగా అధికార పార్టీల నేతలను వారు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం తమిళనాడు(TAMILANADU)లోని అధికార డీఎంకే పార్టీ ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాలు, సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు.
తెల్లవారుజాము నుంచి చెన్నై(CHENNAI) సహా 35 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దర్శకుడు, నటుడు అమీర్ సుల్తాన్ ఇంట్లో అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అమీర్ సుల్తాన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. సీఎం స్టాలిన్(MK STALIN), మంత్రి ఉదయనిధి స్టాలిన్ (UDAYANIDI STALIN)పై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కుటుంబపార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకేను కార్నర్ చేశారు.
ఇటీవల ప్రధాని మోడీ తమిళనాడులో పర్యటించిన సందర్భంగా కచ్చతీవు ద్వీపంపై కాంగ్రెస్, డీఎంకే పార్టీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.దీనిపై కాంగ్రెస్, డీఎంకే సైతం కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి కచ్చతీవును ఎందుకు వెనక్కి తీసుకురావడం లేదని డీఎంకే చీఫ్ స్టాలిన్, కాంగ్రెస్ కీలక నేతలు విమర్శించారు.