హత్యలు చేయడంలో అతని రూటే సపరేటు.. నమ్మకం అతని పెట్టుబడి.. అమాయకులు అతనికి బలిపశువులు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11మందిని హత్యచేసి సీరియల్ కిల్లర్ (Serial Killer) బిరుదు అందుకొన్నాడు.. ఇతన్ని మనిషి అనడం కంటే నరరూప రాక్షసుడు అని పిలవడం సరిగ్గా సరిపోతుందని తెలిసిన వారు అంటున్నారు.. ఇంతకు మనిషిలా పుట్టిన ఈ సైతాన్ పేరు ఏంటని అనుకొంటున్నారా? సత్యనారాయణ.. వయస్సు 47..
నాగర్‌కర్నూల్ (Nagarkurnool)జిల్లా ఇంద్రానగర్ కాలనీ (Indranagar Colony)లో నివాసం ఉంటున్న సత్యనారాయణ చూపుకు బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు.. కానీ ముసుగు తీస్తే ఊసరవెల్లి అంటారు.. ఇతను తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేశాడు. అందులో బాధితులకి విషయం ఇచ్చి చంపడంలో ఆరితేరిన కర్కోటకుడు.. ఊపిరి తీయడంలో పైశాచిక ఆనందం పొందే సీరియల్ కిల్లర్ సత్యనారాయణను పోలీసులు పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకొంటున్నారు..
సత్యనారాయణ ఇప్పటి వరకు 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిపిన పోలీసులు.. ఇతని నుంచి పాయిజన్ బాటిల్స్‌తో పాటు బాధితుల ఫోన్లు, 10 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. TS 31C 3689 అనే నంబర్ గల మారుతీ స్విఫ్ట్ కారును సీజ్ చేశారు. కాగా సత్యనారాయణ 2020 నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
అనేక మందిని గుప్త నిధుల పేరుతో మభ్యపెట్టిన సత్యనారాయణ.. వారినుంచి డబ్బు, స్థలాలు, భూములు రాయించుకునేవాడు. తర్వాత నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి.. తీర్థం పేరుతో నోట్లో యాసిడ్ పోసి చంపేవాడని పోలీసులు పేర్కొన్నారు. ఇలా వనపర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, కర్ణాటకలోని బలగనూరు, ఏపీలోని అనంతపురం జిల్లాల్లో పలువురిని హత్యలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు..