హమూన్ (Hamoon) తుఫాన్ దూసుకు వస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హమూన్’ తుఫాన్ తీవ్ర తుఫాన్ (Cyclone)గా మారుతోంది. ప్రస్తుతం హమూన్’ తుఫాను ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హమూన్ తుఫాను బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా, చిట్టగాంగ్ మధ్య తీవ్ర అల్పపీడనంగా మారి తీరాన్ని తాకనున్నట్టు పేర్కొంది.
బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వల్ల ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అలాగే దక్షిణ అసోంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ‘హమూన్’ ప్రభావంతో ఈ రోజు మిజోరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. త్రిపురలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఐఎండీ ప్రకారం….
ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం నాటికి హమూన్ తీవ్రత తగ్గుతుంది. పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. మరోవైపు ఒడిశాలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది, హమూన్ తుఫాన్ వల్ల బంగాళాఖాతం, తూర్పు భారత్ లోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. ఒడిశా తీరం వెంబడి గంటలకు 40-50 నుండి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.