అన్ని వర్గాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. ఈమధ్యే మైనార్టీ డిక్లరేషన్ తో ముస్లిం ఓట్లను రాబట్టేందుకు హామీల వర్షం కురిపించింది. అయితే.. ఇది మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని మంత్రి కేటీఆర్ (KTR) విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) తీవ్రంగా మండిపడ్డారు. మైనార్టీ డిక్లరేషన్ పై మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ఆయన కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మైనార్టీలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవ చేశారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటేనన్న ఆయన.. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకుండా బీఆర్ఎస్, బీజేపీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపణలు గుప్పించారు. మోడీ, కేసీఆర్ కలిసిపోయారన్నారు. ఇన్నాళ్లూ కేటీఆర్ మీద కొంత గౌరవం ఉండేదని.. ఇప్పుడు అది కూడా పోయిందని విమర్శించారు.
అంతకుముందు, కాంగ్రెస్ డిక్లరేషన్ పెద్ద కుట్ర అని కేటీఆర్ ఆరోపించారు. ఇది బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసిన పన్నాగమని మండిపడ్డా రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జనగణన, మైనార్టీల జనగణన నిర్వహించి దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ను ఏర్పాటు చేసిందని ఆరోపించారు.