షహీద్ రాణి అవంతి బాయి లోధీ (Shaheed Rani Avantibai Lodhi)… బ్రిటీష్ (British) పాలకుల దురాగతాలకు ఎదురు తిరిగిన వీరనారీమణి. భారతీయ రాజులను ఏకతాటిపైకి తీసుకువచ్చి తెల్లదొరలపై యుద్ధం ప్రకటించిన ధైర్యశాలి. బ్రిటీష్ అధికారి వెడ్డింగ్ టన్, అతని సైన్యాన్ని మాండ్ల పొలిమేరల దాకా తరిమిన సివంగి.
1831 ఆగస్టు 16న మధ్యప్రదేశ్ లో రాణి అవంతి బాయి జన్మించారు. తండ్రి జమీందార్ జుజర్ సింగ్. ఈమె వివాహం రాజా విక్రమాదిత్య సింగ్ లోధీతో జరిగింది. తండ్రి రాజా లక్ష్మణ్ సింగ్ మరణంతో విక్రమాదిత్య సింహాసనాన్ని అధిష్టించారు. ఆ తర్వాత కొన్నేండ్లకు మంచాన పడ్డారు. ఆ సమయంలో కుమారులిద్దరూ చిన్నపిల్లలు కావడంతో రాజ్య పాలనను రాణి అవంతి బాయి చూసుకున్నారు.
ఇదే అదనుగా భావించిన బ్రిటీష్ పాలకులు ఆమెకు పాలనలో సలహాలు ఇచ్చేందుకు షేక్ సర్ బ్రాకర్ ను నియమించారు. కానీ, ఈ చర్యను అవంతి బాయి తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు ఎలాంటి సలహాదారులు అవసరం లేదని తేల్చి చెప్పారు. కొద్ది రోజులకే విక్రమాదిత్య మరణించారు. దీంతో ఎలాగైనా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని బ్రిటీష్ పాలకులు కుట్రలు పన్నారు.
దీంతో వారిపై అవంతి బాయి లోధీ ఎదురు తిరిగారు. పోరాటం చేద్దామని ఇతర సంస్థానాదీశులు, జమిందార్లకు పిలుపునిచ్చారు. మాతృ భూమి రక్షణ కోసం బ్రిటీష్ వాళ్లకి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు కంకణం కట్టుకోవాలని లేదా గాజులు ధరించి ఇంట్లో కూర్చొండంటూ ఇతర రాజులకు, జమీందార్లకు ఆమె గాజులను, ఓ లేఖను పంపారు.
ఆమె లేఖతో ఆలోచనలో పడిన వారు బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరగాలని నిర్ణయించారు. మొత్తం 4వేల మందితో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ అధికారి వెడ్డింగ్ టన్ నేతృత్వలోని సేనలను ఓడించారు. మాండ్ల రాజ్యం పొలిమేరల దాకా బ్రిటీష్ సైన్యాన్ని తరిమివేశారు అవంతి బాయి లోధీ. అవమాన భారంతో రగిలిపోయిన బ్రిటీష్ అధికారులు ఓటమికి బదులు తీర్చుకోవాలనుకున్నారు. దేవరి ఘర్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఆమెను హతమార్చారు.