వరల్డ్ కప్ (World Cup)లో వరుస విజయాలతో దూసుకు పోయిన టీమిండియా (Team India)కు ఫైనలో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ప్రపంచ కప్ ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఓటమిపై భారత జట్టుకు చెందిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) ట్విట్టర్లో స్పందించారు.
నిన్నటి రోజు మనది కాకుండా పోయిందని షమీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కానీ త్వరలోనే రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ టీమిండియా పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో పాటు తనను ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చుతున్న ఫోటోను జోడిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
దురదృష్టవశాత్తూ నిన్న మన రోజు కాకుండా పోయిందన్నారు. ప్రపంచ కప్ టోర్నీలో తనతో పాటు మన జట్టుకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి తమ ఉత్సాహాన్ని పెంచినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు.
త్వరలోనే తాము తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఫైనల్ మ్యాచ్లో ఓటమితో టీమిండియా సభ్యు ముఖాల్లో కన్నీళ్లు కనిపించాయి. మైదానంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కండ్లల్లో నీళ్లు తిరిగాయి. ఓటమి బాధను తట్టుకోలేక మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.