భారతదేశ (India) సంస్కృతి, సంప్రదాయాన్ని రక్షించడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కృషిని మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ శంకర్ మహాదేవన్ ప్రశంసించారు. అఖండ భారత్ భావజాలాన్ని పరిరక్షించడంలో ఆర్ఎస్ఎస్ విశేష కృషి చేస్తోందన్నారు. దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనికి సంఘ్ నుండి మాత్రమే తాను ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు.
నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ దశమి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట జ్ఞాన సరస్వతి వందనంతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ గురించి తాను ఏమి చెప్పగలనన్నారు. కేవలం వారికి సెల్యూట్ మాత్రమే చేయగలనన్నారు. మన సిద్ధాంతాలను, మన సంస్కృతిని కాపాడటంలో ఆర్ఎస్ఎస్ సహకారం అందరికంటే గొప్పదని తెలిపారు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇదే మన భారత్ తత్వం అన్నారు. ముంబైలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో తన సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అది ఒక గొప్ప అనుభవంగా ఆయన అభివర్ణించారు. ఈ సమావేశానికి తనకు ఆహ్వానం పంపినందుకు ఆర్ఎస్ఎస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అంతకు ముందు నాగ్ పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డా.కేబీ.హెడ్గేవార్ స్మారకాన్ని, హెడ్గేవార్ స్మృతి మందిర్‌ను శంకర్ మహదేవన్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తాను ఈ రోజు భారతీయ నాగరిక్ (భారత పౌరుడు) అయినందుకు మరింత గర్వపడుతున్నానని వెల్లడించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.