– షర్మిల కొడుకు పెళ్లి వివాదం
– హిందూ సంప్రదాయ వీడియోపై వివరణ
– అదంతా డ్రామా అని తేల్చేసిన షర్మిల
– హిందూ ఆచారాలపైనా అనుచిత వ్యాఖ్యలు
– షర్మిలపై హిందూ సంఘాల ఆగ్రహం
– జగన్ దీ ఇదే తీరు అంటూ విమర్శలు
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల.. ఈమధ్య తన కుమారుడికి పెళ్లి చేశారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో రాజారెడ్డి, ప్రియ వివాహ వేడుకను ఘనంగా జరిపారు. ఈ జంట క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షర్మిల విడుదల చేశారు. అయితే.. కొన్ని కార్యక్రమాల్లో హిందూ సంప్రదాయాల టచ్ ఇచ్చారు. ముందుగా బైబిల్ సమక్షంలో పెళ్లి చేసుకున్న జంట.. తర్వాత హిందూ వేషధారణలో కార్యక్రమాలు జరిగినట్టుగా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించింది. దీనిపై షర్మిల స్పందిస్తూ.. ‘క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి.. తర్వాత తెలుగు స్టైల్ లో తలంబ్రాల దృశ్యం’ అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
పక్కా క్రిస్టియన్స్ గా మారిన షర్మిల కుటుంబం.. హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి కార్యక్రమాలు కొనసాగించడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో జరిగింది. దీంతో ఆమె తాజాగా వివరణ ఇచ్చారు. హిందూ ఆచారాలను పాటిస్తున్నట్టు కనిపించినా.. ఏదో తూతూమంత్రంగా సాగినట్టు ఆమె మాటలను బట్టి అర్థం అవుతోంది. క్రిస్టియన్స్ కు వివరణ ఇవ్వడానికి అన్నట్లుగా మాట్లాడిన షర్మిల.. హిందూ ఆచారాల ప్రకారం సాగిన కార్యక్రమాలు ఫేక్ అని.. బియ్యం కూడా లేకుండా తలంబ్రాలు.. పురోహితుడి మంత్రాలు లేకుండా జరిగాయని చెప్పుకొచ్చారు. (తాళి లాగా) ఒక దండ వేసుకుంటాం మనం.. అందులో క్రాస్ ఉంటుంది అని అన్నారు.
అసలు, షర్మిల ఈ వివరణ ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాము క్రిస్టియన్ పద్ధతిలో మాత్రమే పెళ్లి చేశాం అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు ఉండడంతో.. ఆమె భర్త, పాస్టర్ అనిల్ కి స్పాన్సర్ చేసే క్రిస్టియన్ సంస్థలకు కోపం వచ్చిందా? లేక, క్రిస్టియన్స్ ఓట్లు పోకుండా చూసుకునే ప్రయత్నమా? అనే అనుమానాలను సోషల్ మీడియాలో కొందరు లేవనెత్తుతున్నారు.
మరోవైపు, మాటల మధ్యలో హిందూ సంప్రదాయాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు షర్మిల. పసుపుకి హిందువులకు సంబంధం లేదని.. అందరూ వంటలో వేసుకుంటాం కదా.. అది హిందూ పద్దతి ఎలా అయిందో తనకు తెలియదని అన్నారు. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పసుపు, కుంకుమ అనేవి హిందూవుల ఆచారాల్లో భాగమని.. ఓట్ల రాజకీయం కోసం లేనిపోనివి మాట్లాడొద్దని మండిపడుతున్నాయి. ఇటు, బీజేపీపైనా సెటైర్లు వేశారు షర్మిల. పసుపో కాషాయమో ఎక్కువ వాడినంత మాత్రాన ఆ రంగులు వారి సొంతం అయిపోవని.. రంగులు మన దేవుడు (క్రీస్తు) కనిపెట్టాడు అని అన్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ సందర్భంగా జగన్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. ఆయన కూడా ఇంతేనని.. హిందూ దేవుళ్ల ప్రసాదం తినకుండా.. ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారని.. తీర్థానికి బదులు మినరల్ వాటర్ పోయించుకొని తాగుతారని అంటున్నారు. అంతేకాదు, విశాఖ స్వామీజీని అప్పుడప్పుడు కలిసి ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి హిందూవుల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు.