మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) పై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రశంసల వర్షం కురిపించారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చారు. ఇక మరో నేత కైలాస విజయ వర్గీయను హార్దిక్ పాండ్యాతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రదేశ్ ను హార్ట్ ఆఫ్ ఇండియా అన్నారు.
ఇండోర్‌లో బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ…. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ టీమ్ ఇండియాలో మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వ్యక్తి అని చెప్పారు. ఎన్నికల్లో ప్రారంభం ఎలా మొదలైనా దాన్ని విజయంతో ఎలా ముగించాలో శివరాజ్ సింగ్ కు తెలుసన్నారు.
ఇక మధ్య ప్రదేశ్ పాలిటిక్స్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ధోనీ అయితే కైలాష్ విజయ వర్గీయ హార్దిక్ పాండ్య లాంటి వాడన్నారు. 18 ఏండ్ల క్రితం మధ్యప్రదేశ్ బిమారు రాష్ట్రంగా ఉండేదని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని బీజేపీ పాలిస్తోందన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వల్లే మధ్య ప్రదేశ్ బిమారు జాబితా నుంచి బయటపడిందన్నారు.
మధ్యప్రదేశ్ అనేది భారత్ కు హార్ట్ (గుండె కాయ లాంటిది) అని చెప్పారు. అందులో ఇండోర్ అనేది భారత్ కు హార్ట్ బీట్ లాంటిదన్నారు. ఇక్కడ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేవలం ఒకటి కాదు నాలుగు ఇన్వెస్ట్మెంట్ కారిడార్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమన్నారు.