షోయబ్ ఉల్లాఖాన్ (Shoaib Ullah Khan)…. గొప్ప కలం యోధుడు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్ని నిజాం (Nizam) నిరంకుశ పాలనపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప అక్షర వీరుడు. రజాకార్ల దురాగతాలపై అక్షరాలతో నిప్పులు చెరిగిన పాత్రికేయ ధీరుడు. జీవితాంతం తాను నమ్మిన సిద్దాంతం కోసం పని చేసి చివరకు ప్రాణాలు కోల్పోయిన గొప్ప నిజాయితీ పరుడు.
17 అక్టోబర్ 1920న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబ్ ఉల్లా ఖాన్, తల్లి లియాఖతున్నీసా బేగం. హబీబ్ ఉల్లాఖాన్ యూపీ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. షోయబ్ ఉల్లా ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, జర్నలిజం డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత తజ్వీ మ్యాగజీన్లో జర్నలిస్టుగా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు.
అప్పటి నుంచి భారత్‌లో హైదరాబాద్ రాజ్యం విలీనానికి అనుకూలంగా వ్యాసాలు రాయడం మొదలు పెట్టారు. హైదరాబాద్ రాజ్యంలో నిజాం నిరంకుశ పాలనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాం రాజ్యంలో ప్రజలపై జరుగుతున్న హింసాకాండను తన ఆర్టికల్స్ ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో తజ్వీ పత్రికపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ క్రమంలో నర్సింగరావు సంపాదకత్వంలో వస్తున్న ఇమ్రోజ్ మ్యాగజీన్లో డిప్యూటీ ఎడిటర్‌గా చేరారు. ఆ పత్రికలోనూ రజాకర్ల దురగతాలను ఎండగడుతూ పతాక శీర్షికన వ్యాసాలు రాశారు. దీంతో ఆ పత్రికపై కూడా నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఇమ్రోజ్ పేరిట దినపత్రికను తీసుకు వచ్చారు. ఆయన వ్యాసాలతో ఆగ్రహం చెందిన కాశీం రజ్వీ షోయబ్ ఉల్లా ఖాన్ చేతులను నరికి వేయాలని రజాకర్లను ఆదేశించారు.
1948 ఆగస్టు 22న షోయబ్ ఉల్లా ఖాన్ తన విధులు ముగించుకుని ఇమ్రోజ్ కార్యాలయం నుంచి తన ఇంటికి బయలు దేరారు. చాపెల్ బజార్ నుండి లింగంపల్లి రోడ్ మీదుగా తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా రజాకార్లు షోయబ్ ఉల్లాఖాన్ పై రజాకార్లు దాడి చేశారు. దీంతో షోయబ్ ఉల్లా ఖాన్ మరణించారు. వెంటనే ఆయన కుడి చేతిని రజాకార్లు నరికి వేశారు.