శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. దేశంలోని మొత్తం 290 ప్రాంతాల్లో శ్రీరామ (Sri Rama) రాతి స్తంభాల (Pillar)ను ఏర్పాటు చేయనున్నట్టు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champath Rai) వెల్లడించారు. వీటిపై శ్రీరాముడి జీవిత విశేషాలు, రాముడి ప్రాముఖ్యతను వివరించేలా ఈ స్తంభాలు వుంటాయని ఆయన పేర్కొన్నారు.
అయోధ్య నుంచి రామేశ్వరం వరకు శ్రీరామ్ వన గమన్ మార్గ్ వరకు 290 ప్రాంతాల్లో ఈ స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ రాతి స్తంభాల నిర్మాణంలో ప్రభుత్వానికి చెందిన ఒక్క రూపాయి కూడా వాడబోమని ఆయన తెలిపారు. ఈ మొత్తం నిర్మాణ ఖర్చును భరించేందుకు అశోక్ సింఘాల్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చిందన్నారు.
అశోక్ సింఘాల్ ట్రస్టు ఢిల్లీలో వుందన్నారు. శ్రీ రాముడి జీవితంతో సంబంధం కలిగి వున్న ప్రాంతాల్లో రాతి స్తంభాలు ఏర్పాటు చేయాలని ట్రస్టు ఆలోచన చేసిందన్నారు. వాల్మీకి రామాయణంలో ఆ ప్రాంతం గురించి రాసిన ఏదైనా పద్యాన్ని స్థానిక భాషలో లిఖించనున్నట్టు చెప్పారు. దాని అర్థాన్ని కూడా స్థానిక భాషలో వివరించనున్నట్టు వెల్లడించారు.
డాక్టర్ అవతార్ శర్మ అనే ఢిల్లీ నివాసి ఆయా ప్రాంతాలపై అధ్యయనం చేశారని చెప్పారు. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఆయన 10 సార్లు వెళ్లి ఆయా ప్రాంతాలను దర్శించారన్నారు. ఆయన మద్దతుతో ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ఆయా ప్రాంతాల్లో 100 నుంచి 120 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుందన్నారు.