సిక్కిం (Sikkim) లో వరదలు (Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల్లో ఇప్పటి వరకు 53 మంది మరణించారు. మరో 140 మంది గల్లంతయ్యారు. ఈ వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ క్లౌడ్ బరెస్ట్ వెనుక డ్రాగన్ కంట్రీ కుట్రలు దాగి వున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. చైనా క్లౌడ్ సీడింగ్ చేయడంతోనే క్లౌడ్ బరస్ట్ జరిగి వరదలు సంభవించాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత కొన్నేండ్లుగా చైనా రాజధాని బీజింగ్ ప్రాంతంలో పొల్యూషన్ భారీగా పెరిగి పోయింది. ఈ క్రమంలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించి పొల్యూషన్ ను తగ్గించాలని చైనా భావిస్తోంది. ఈ క్రమంలో గత కొంత కాలంగా చైనా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు మార్లు క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలను చేసింది. దీనిపై అంతర్జాతీయంగా ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
గతేడాది అక్టోబర్ 3న చైనా తన ఆధీనంలోని టిబెట్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఎయిర్ క్రాఫ్ట్ పరిమాణంలో వున్న వింగ్ లుంగ్-2 అనే డ్రోన్ ను ఉపయోగించి టిబెట్ లోని పీఠభూమి ప్రాంతంలో సుమారు ఐదు గంటల పాటు ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. చైనా వాతావరణ మార్పుల కేంద్రం, ఏవీఐసీ కంపెనీ, డ్రాగన్ సైన్యం ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి.
ఈ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ వల్ల సుమారు 15 వేల చదరపు కిలో మీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైనా అప్పుడు వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 3న ఈ క్లౌడ్ సీడింగ్ ప్రయోగం పూర్తయింది. సరిగ్గా ఈ ప్రయోగం పూర్తయిన ఏడాది తర్వాత అదే రోజున చైనా సమీపంలోని సిక్కిం ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావడంతో ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.