Telugu News » Tirupathi : మూడు నెలల్లో బోనుకు చిక్కిన ఆరు చిరుతలు

Tirupathi : మూడు నెలల్లో బోనుకు చిక్కిన ఆరు చిరుతలు

తిరుమల నడక దారిలో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజూమున ఈ బోనులో చిరుత చిక్కింది.

by Prasanna
leopard

తిరుమల (Tirumala) లో బ్రహ్మోత్సవాల సందడి…భక్తుల కోలాహలం నెలకొంది. ఇదే సమయంలో శ్రీవారి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది. ఈ చిరుత (Leopard) తో మొత్తం గత మూడు నెలల్లో అటవీశాఖ  అధికారులు ఏర్పాటు చేసిన బోనులకు (Traps) ఆరు చిరుతలు చిక్కినట్లైయ్యింది.

leopard

తిరుమల నడక దారిలో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజూమున ఈ బోనులో చిరుత చిక్కింది. ఈ చిరుతను శ్రీవేంకటేశ్వర జూపార్క్ కు తరలించనున్నారు. ఈ చిరుత వయస్సు నాలుగు సంవత్సరాలు ఉంటుందని అటవీ సిబ్బంది అంచనా వేశారు.

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బోనులో చిక్కిన చిరుతను పరిశీలించారు. చిరుతలను బంధించడానికి తాము అనుసరిస్తోన్న వ్యూహాలు ఫలిస్తోన్నాయని అన్నారు. భక్తుల రక్షణ విషయంలో రాజీ పడబోమని చెప్పారు. నడకదారిలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతానికి తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు.

నడకదారిలో ఇలా వరుసగా చిక్కుతున్న చిరుతలతో భక్తుల్లో అలజడి పెరుగుతోంది. వరుసగా చిరుతలు బోనుకి చిక్కుతున్నాయంటే…ఇంకా ఈ ప్రాంతంతో ఎన్ని చిరుతలు ఉన్నాయి, అవి తమకు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తాయనే భయం నడకదారిలో వెళ్తున్న భక్తుల్లో కనిపిస్తోంది. ఏవైనా వన్య ప్రాణులు కనిపిస్తే వాటిని అదిలించి, వాటి నుంచి రక్షణ పొందేందుకు టీటీడీ ఇటీవలే నడకదారిలో వెళ్లే భక్తులకు చేతికర్రలు ఇచ్చే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

తిరుమల నడక మార్గంలో లక్షితపై చిరుత దాడి చేసిన అనంతరం టీటీడీ ఆపరేషన్ చిరుతను చేపట్టింది. వాటి సంచారాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టడానికి 500 చోట్ల సీసీ కెమెరాలను నడకదారి చుట్టు పక్కల ప్రాంతాల్లో అమర్చారు. చిరుతలు తిరుగుతాయనే అంచనాలున్న ప్రదేశాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన బోనుల్లో ఇప్పటి వరకు ఆరు చిరుతలు చిక్కాయి.

You may also like

Leave a Comment