స్కిల్ డెవలప్ మెంట్ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు అంతా పచ్చి భూటకమని, ఇందులో నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలంటూ టీడీపీ నాయకులు ఒక వెబ్ సైట్ (Website) ను ప్రారంభించారు. apskilldevelopmenttruth.com వెబ్ సైట్ ను ఇవాళ అమరావతిలో టీడీపీ ప్రారంభించింది.
చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఆ విషయం ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశ్యంతో వెబ్ సైట్ ఓపెన్ చేశామని అచ్చెన్నాయుడు చెప్పారు. 2014 నవంబరు నుంచి జరిగిన అన్ని అంశాలను ఈ వెబ్ సైట్ లో ఉంచాం. దీనిని చూస్తే అందరికి అన్ని విషయాలు అర్థమవుతాయి.
ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారని, తద్వారా 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన టీడీపీపై జగన్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం పై వాస్తవాలు తెలియజేయాలని వెబ్ సైట్ తీసుకొచ్చామని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిరసనకు దిగుతున్నారని చెప్పారు. ఇక నుంచి వైసీపీ పతనం ప్రారంభమైనట్లే అని చెప్పారు.