పార్లమెంట్ నూతన భవనంలో ప్రవేశించిన సందర్బంగా ఎంపీలకు రాజ్యాంగం కాపీలను బహుమతిగా ఇచ్చారు. ఆ రాజ్యాంగ ప్రతుల్లో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ అనే పదాలు ( Secular Socialist) అనే పదాలు లేవని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ పదాలను పీఠికలో చేర్చారని ఆయన గుర్తు చేశారు.
ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో ఆ పదాలు పొందుపరచలేదన్నారు. దీన్ని రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా ఆయన ఆరోపణలు గుప్పించారు. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తెలవిగా తొలగించారని అన్నారు. మనం రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కారణమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఇది కచ్చింగా రాజ్యాంగాన్నిమార్చేందుకు జరుపుతున్న ప్రయత్నమేనన్నారు.
మరోవైపు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా దీనిపై స్పందించారు. రాజ్యాంగ ప్రవేశికలో ఆ రెండు పదాలు కనిపించడం లేదన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా స్పందించారు. మనసులో ఏ ఆలోచన ఉంటే చేతల్లో కూడా అదే జరుగుతుందని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశికను మార్చారని అన్నారు.
ఎంపీల విమర్శల నేపథ్యంలో దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పందించారు. సభ్యులకు అసలైన రాజ్యాంగం కాపీలను ఇచ్చినట్టు ఆయన చెప్పారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆ పదాలు పీఠికలో లేవని, ఆ తర్వాత సవరణలు చేసి వాటిని పొందు పరిచారన్నారు. తాము ఇచ్చిన కాపీలు అసలైన ప్రవేశిక ఆధారంగా వున్నాయన్నారు.