చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ పై ఆయన అనుకూల వర్గాల నుంచి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఓవైపు టీడీపీ (TDP) శ్రేణులు అనేక కార్యక్రమాలు చేపడుతుండగా.. హైదరాబాద్ (Hyderabad) లో ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. జగన్ (Jagan) సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఐయామ్ విత్ సీబీఎన్ ప్లకార్డులతో నిరసన తెలిపారు ఐటీ ఉద్యోగులు. కక్ష సాధింపు రాజకీయాలు తగదని.. ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతమని పేర్కొన్నారు. ఏపీలో సైకో పోవాలి – సైకిల్ రావాలని నినాదాలు చేశారు. అయితే.. ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను పంపించారు.
ఇక, చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. బుధవారం ఉదయం పొద్దుటూరులోని తన నివాసం నుంచి తిరుమలకు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయన్ను అభినందించారు. ప్రవీణ్ తోపాటు మరో 60 మంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. వారంపాటు ఈ పాదయాత్ర సాగనుంది. పొద్దుటూరు నుంచి తిరుమలకు 230 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ.. ఓ కార్యకర్త ఏకంగా విమానంలోనే నిరసన తెలిపాడు. విశాఖపట్నం వెళ్లే విమానంలో ‘సేవ్ డెమోక్రసీ’ ప్లకార్డుతో నిరసనకు దిగాడు. ఆ తర్వాత రన్ వే పై పడుకుని ఆందోళన చేపట్టాడు. చంద్రబాబు అరెస్టుపై ఏపీ గవర్నర్ కలగజేసుకుని న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.