తెలంగాణా (Telangana)లో సన్నబియ్యం రేట్లు (Rice Price) పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో పోలీస్తే వెయ్యి రూపాయలు వరకు ధరలు పెరిగాయి. డిమాండ్ కు తగ్గట్టుగా సన్నబియ్యం ఉత్పత్తి (Rice Production) లేకపోవడంతో మార్కెట్ లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.
బియ్యం రేట్లు పెరగకుండా కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ, దేశీయంగా సన్నబియ్యం సాగు పడిపోవడం, ఈ సారి దిగుబడులు 25 శాతానికంటే తక్కువకు చేరుతాయనే అంచనాలతో వ్యాపారులు నిల్వలను బ్లాక్ చేశారు. సన్నబియ్యానికి ఉన్న డిమాండును సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సన్నబియ్యం వినియోగం గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగిందని బియ్యం వ్యాపారులు చెప్తున్నారు. నిరుడు జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 70 వేల క్వింటాళ్ల నుంచి 80 వేల క్వింటాళ్ల సన్న బియ్యం వినియోగం కాగా, ప్రస్తుతం 80 నుంచి లక్ష క్వింటాళ్ల వరకు వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. ఇట్ల వినియోగం పెరగడం, ఆ మేరకు ఉత్పత్తి పెరగకపోవడం వల్లే సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెప్తున్నారు.
సరైన ధర లభించకపోవడంతో 2022 వానాకాలం సీజన్ నుంచి రైతులు సన్న బియ్యం సాగు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సన్నబియ్యం దిగుబడి 30 లక్షల టన్నులకు పడిపోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా’ ఉందంటే.. ప్రస్తుత వానాకాలం సీజన్లో 20 శాతం మించి సన్నబియ్యం సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే.. అందులో కేవలం 11,383 ఎకరాల్లోనే సన్నబియ్యం సాగు చేస్తున్నారు.