ఈ నెల 17న సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణా (Telangana) వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు (Congress Leader) భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులతో పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణా రాక సందర్భంగా మీడియాతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.
కేసీఆర్ కొంగర కలాన్ లో సభ పెడితే, రూ. 500 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల మంది కూడా రాలేదు, ఇప్పుడు సోనియా సభకు 10 లక్షల మంది కంటే ఎక్కువ మందే వస్తారని వెంకటరెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఎప్పటికీ రాకపోయి ఉండేదని, తెలంగాణా ముఖ్య మంత్రి కుటుంబ సభ్యులతో సోనియాని కలవలేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు వస్తున్న సందర్భంగా ఆమెను చూసేందుకు వృద్దులు వస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం అధికారంలోకి రావాలని అన్నారు.
తెలంగాణాలో ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఇంకా జీతాలు పడలేదని, ఝార్ఖండ్, బీహార్ లో కూడా జీతాలు పడుతున్నాయని…ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణాలో ఈ పరిస్థితికి కేసీఆర్ విధానాలే కారణమని అన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లు కట్టామని కేసీఆర్ చెబుతున్నారని, అది వాళ్ళ కార్యకర్తలకే సరిపోవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మద్యం టెండర్లు విజయవంతం చేసి, ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లు రద్దు చేశారని అన్నారు. ఎన్నికల ముందు దళితబంధు, రైతు బంధు అంటూ కేసీఆర్ హడావిడి చేస్తుంటారని విమర్శించారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తాను నల్గొండ నుంచి పోటీ చేస్తున్నట్లు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి నుంచి 50 వేల ఓట్లతో గెలవడం కూడా ఖాయమని స్పష్టం చేశారు.