దక్షిణ కొరియా (South Korea) లో యువత పిల్లలను కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆ దేశంలో యువత జనాభా తగ్గిపోతూ…వృద్ధుల జనాభా (Population) పెరిగిపోతుంది. దీంతో ఆ దేశంలోజనాభా విషయంలో అందోళన మొదలైంది.
ఈ సమస్యపై దృష్టి పెట్టిన ఆ దేశ అధికారులు ఓ పైలట్ ప్రాజెక్టును ప్రకటించారు. పిల్లల పెంపకం, సంరక్షణ విషయంలో వత్తిడిని తట్టుకోలేకే ఆ దేశంలో పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. ప్రజలపై ఈ ఒత్తిడి తగ్గించేందుకు, పిల్లల సంరక్షణతో పాటు ఇంటిపనుల్లో చేదోడువాదోడుగా ఉండేందుకు సహాయకులను అనుమతించేందుకు దక్షిణ కొరియా అధికారులు నిర్ణయించారు.
విదేశీ సహాయకుల పేరుతో వీరిని దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించారు. తొలుత ఈ పైలట్ ప్రాజెక్టుని దేశ రాజధాని సియోల్‌లోని కొన్ని ఎంపిక చేసిన ఇళ్లలో నియమించుకునేందుకు 100 మందిని అనుమతించనుంది. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరు నుండి మొదలవుతుంది. క్రమక్రమంగా పరిశ్రమలకు, ఇతర సంస్థలకూ విస్తరించాలనే ఆలోచనలో దక్షిణ కొరియా ఉంది.
దక్షిణ కొరియా ఇటీవల తమ దేశంలో వివాహాలపై అనాసక్తి, జనాభా తగ్గుదలపై ఓ సర్వే నిర్వహించింది. 19 నుంచి 34 ఏళ్ల వారిలో సగానికి పైగా జనాభా…వివాహం తర్వాత కూడా పిల్లలను కనేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు.. కేవలం 36.4 శాతం మంది మాత్రమే తమకు వివాహం పట్ల సానుకూల దృక్పథం ఉందని, కానీ ఆర్థిక ఇబ్బందులు, గృహభారం, చిన్నారుల సంరక్షణ తదితర సమస్యలున్నాయన్నారు. ఈ క్రమంలోనే సంరక్షణతోపాటు ఇంటిపనుల భారం తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు సిద్ధమైంది.
20 ను 40 ఏళ్లలోపు వయసున్న, ఇద్దరూ సంపాదిస్తోన్న జంటలతోపాటు సింగిల్ పేరెంట్, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ఈ ప్రాజెక్టులో ప్రాధాన్యం ఇవ్వనుంది.
తొలుత ఆరు నెలల పాటు సాగే ఈ ప్రాజెక్టులో విశ్వసనీయ ఏజెన్సీల ద్వారా విదేశీ సహాయకులను స్థానికుల ఇళ్లలో పనులకు అనుమతిస్తారు. దక్షిణ కొరియా ప్రస్తుత జనాభా దాదాపు 5.17 కోట్లు. తయారీ, వ్యవసాయ రంగాల్లో కార్మికుల కొరతతో చాలా కాలంగా సమస్యలు ఏర్పడుతున్నాయి.