తెలంగాణ సర్కార్(Telangana Government) 10వ తరగతి విద్యార్థులకు(10TH Students) శుభవార్త చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధన(Minute provision)ను ఎత్తివేసింది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్ టైం(5 minutes grace time )ను ప్రకటించింది.
మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కాస్త టెన్షన్ లేకుండా రావచ్చని భావిస్తున్నారు. అయితే 9.35గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు తప్పుడు ప్రశ్నపత్రాలు జారీ చేస్తే ఇన్విజిలేటర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అభ్యంతరాలపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ నుంచి వివరణ కోరాలని ఇన్విజిలేటర్లను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని విద్యాశాఖ తెలిపింది. పరీక్షల పర్యవేక్షణకు విద్యాశాఖ, రెవెన్యూ శాఖ నుంచి ఒక్కో అధికారి, ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు పేర్కొంది.