న్యాయస్థానాల్లో ఎక్కువగా మైలార్డ్ (MY Lord)… యువర్ హానర్ (Your honor) అనే పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. న్యాయమూర్తిని గౌరవంగా సంబోధించే సందర్భంలో ఈ పదాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలాగే సుప్రీం కోర్టులో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ ఓ న్యాయవాది ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్స్’ అంటూ సంభోదించారు.
ఇలా పదే పదే సంభోదించడంపై జస్టిస్ పీఎస్ నరసింహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్’అని మీరు ఎన్నిసార్లు పిలుస్తారంటూ న్యాయవాదిపై ఆయన అసహనం న వ్యక్తం చేశారు. ‘మీరు మై లార్డ్ అని పిలవడం ఆపేస్తే మీకు నా సగం జీతం ఇస్తాను’అని జస్టిస్ బోపన్న అన్నారు.
మై లార్డ్ బదులుగా మీరు ‘సార్’ అనే పదం ఎందుకు ఉపయోగించకూడదని న్యాయవాదికి జస్టిస్ పీఎస్ నరసింహా సూచించారు. సార్ అని సంభోదించాలని లేదంటే మీరు “మై లార్డ్స్” అనే పదాన్ని ఎన్నిసార్లు అంటున్నారో తాను లెక్కిస్తానని చెప్పారు. ఇది ఇలా వుంటే వాదనల సమయంలో న్యాయవాదులు మై లార్డ్, మై లార్డ్ షిప్ అంటూ సంభోదిస్తూ ఉంటారు.
బ్రిటీష్ కాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఇటీవల ఈ ఆచారాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. దీన్ని వలస రాజ్యాల కాలం నాటి అవశేషాలు అని, ఇది బానిసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తున్నారు. ఈ క్రమంలో 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానంలో ఏ న్యాయవాది కూడా న్యాయమూర్తిని మై లార్డ్ అని సంభోదించ కూడదని తీర్మానించింది. కానీ అది ఆచరణలోకి రాలేదు.