ప్రొఫెసర్ కోదండ రాం (Kodandaram) ఎమ్మెల్సీ (MLC) పదవిని బీఆర్ఎస్ (BRS) అడ్డుకుందని చెబుతూ టీజేఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా టీజేఎస్ శ్రేణులు పెద్దు ఎత్తున నినాదాలు చేశాయి.
టీజేఎస్ నగర అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ…. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రొఫెసర్ కోదండ రాం అనే ఆటంకాలను ఎదుర్కొన్నారని చెప్పారు. కోర్టులో కోదండరాంపై వేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా నిరసన తప్పదని ఆయన హెచ్చరించారు.
చట్ట సభల్లోకి వెళ్లకుండా ప్రొఫెసర్ కోదండ రాంను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని పలువురు విద్యార్థులు, నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొని బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ తీరును నిరసిస్తూ సిటీ లైబ్రరీలో విద్యార్థులు, నిరుద్యోగులు నిరసనకు దిగారు.
కోర్టు పిటిషన్లతో కోదండ రాం ఎమ్మెల్సీ పదవిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ విద్యార్థులు డి సలీం, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం ముందుండి పోరాటం చేశారని వెల్లడించారు.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కోదండరాంను బీఆర్ఎస్ పక్కన పెట్టిందని ఫైర్ అయ్యారు. ఇటీవల ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తీరును ఖండిస్తున్నామని చెప్పారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బొంద పెడతామని హెచ్చరించారు.