ఉస్మానియా యూనిర్శిటీ (Osmania University)లోని పీజీ కళాశాల (PG College) విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించారని చెబుతూ కళాశాల ఎదుట బైఠాయించారు. హాస్టల్‌లో తమకు భద్రత కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. ముగ్గురు ఆగంతకులు శనివారం ఉదయం గోడ దూకి హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఓ విద్యార్థిని వాష్ రూంలోకి వెళ్లగానే ఆగంతకులు వెంటిలెటర్ పై నుంచి చేతులు లోపలికి పెట్టి సైగలు చేశారని విద్యార్థినులు చెప్పారు.
ఈ క్రమంలో భయంతో సదరు విద్యార్థిని కేకలు పెట్టడంతో హాస్టల్ లోని విద్యార్థుల మంతా బయటకు వచ్చామన్నారు. ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా పట్టుకునే ప్రయత్నం చేశామని చెప్పారు. ఆ సమయంలో ఓ విద్యార్థిని దుండగులు గాయపరిచారని పేర్కొన్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు పారిపోగా మరో వ్యక్తిని పట్టుకున్నామని వెల్లడించారు.
అనంతరం నిందితునికి దేహశుద్ది చేసి విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు. హాస్టల్‌లో తమకు భద్రత కరువైందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ వచ్చి తమకు హామీ ఇవ్వాలని ఆందోళన చేశారు. దీనిపై డీసీపీ రోహిణి ప్రియదర్శిని స్పందించారు. కళాశాల ప్రిన్సిపల్ తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.