తమ పిల్లలు మంచి చదువులు చదువి ఉన్నత స్థాయిలో ఉండాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలు కల్లలు గానే మిగిలిపోతున్నాయి. నేటి యువత శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా బలహీనంగా ఉంటున్నారు.
ఒత్తిడితో కూడిన విద్య, కొరవడిన ఆత్మ స్థైర్యం, కుటుంబ పరిస్థితులు, కాలేజ్ వాతా వరణం కారణాలు, వయో సంబంధ నిర్ణయాలు, వ్యసనాలు ఏవైతేనేం…ఇటీవల ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నారు.
ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ (IIT HYDERA BAD) లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019 నుంచి 2023 సం.ల మధ్య కాలంలో ఇదే క్యాంపస్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది.
గత నెల 17న మిర్యాలగూడకు చెందిన కార్తీక్ అనే విద్యార్థి విశాఖ బీచ్ (Visakha Beach )లో ఆత్మహత్య చేసుకోగా ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్ లో ఎంటెక్ చదువుతున్న మమైత జాయిస్ (21) అనే విద్యార్థిని బుధవారం రాత్రి క్యాంపస్ లోని హాస్టల్ గదిలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
బతుకు భారంగా ఉందని..తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, ఆమె తన సూసైడ్ నోట్(SUICIDE NOTICE) లో పేర్కొంది. తన మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు, మీడియాలోను చూపించొద్దంటూ సూసైడ్ నోట్ లో వేడుకుంది.
విద్యార్థిని తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారి కుటుంబం ఆర్థికంగా బాగానే ఉందని ఆమె బంధువులు తెలిపారు. జాయిస్ మృతి పట్ల అనుమానం ఉంది అని వారు తెలిపారు. సంగారెడ్డి రూరల్ ఎస్సై రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా బాసర ఆర్జీయూకేటీ(RGUKT)లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…నిర్మల్ జిల్లా( Nirmal district ) బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) జాదవ్ బబ్లూ పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను ఉంటున్న హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు.
అయితే తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఆ యువకుడిది సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్గా అధికారులు గుర్తించారు. బబ్లూ ఆత్మహత్య గురించిన సమాచారాన్ని అతని కుటుంబసభ్యులకు అందించారు.
కాగా, ఈ ఏడాదిలో బాసర ట్రిపుల్ ఐటీలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు తెలిపారు. విద్యాలయాల్లో వరుస విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.