ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development) కేసులో పదే పదే వినిపించచే పేరు సీమెన్స్ (Siemens) కంపెనీ. ఈ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ (Suman Bose) స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలపై ఢీల్లీలో మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్, సీమెన్స్ కంపెనీ, అలాగే తనపైన వస్తున్నఆరోపణలను ఖండించారు. ఒక్క సెంటర్ కూడా చూడకుండా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు బోగస్ అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ ఒక విజయవంతమైన ప్రాజెక్టు అని ఆయన కితాబు ఇచ్చారు. సీమెన్స్ సంస్థ మార్కెటింగ్ లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని, ఆరోపణలన్ని నిరాధారమైనవేనని చెప్పారు.
2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐటీ అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్ మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని, 2021 నాటికి 2.32 లక్షల మంది యువత ఈ సెంటర్ల ద్వారా నైపుణ్యం సాధించారని తెలిపారు. వారిలో చాలా మంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 2016లో విజయవంతమైన ప్రాజెక్టుగా కేంద్రం అవార్డు కూడా ప్రకటించిందనే విషయాలను సుమన్ బోస్ గుర్తు చేశారు.
2021 లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ప్రాజెక్టు అందించిన ఫలితాలు చూసి ఏవరైనా మాట్లాడితే బాగుంటుందన్నారు. ఇదే తరహా ప్రాజెక్టును చాలా రాష్ట్రాల్లో అమలు చేశామని చెప్పారు. ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు కోర్టులకు చెబుతామని సుమన్ బోస్ అన్నారు.