‘సన్ బర్న్’ (Sun Burn)సంగీత కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. ఈ వేడుకకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు అనుమతులు లేకుండానే టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించవద్దని సర్కార్ హెచ్చరించింది.
అనుమతులు లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉన్నతాధికారుల సమావేశంలో ఈ ఈవెంట్ గురించి సీఎం ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో టికెట్లు విక్రయించినట్టు తన దృష్టికి వచ్చిందని, అసలు ఆ కార్యక్రమానికి అనుమతులు ఎలా ఇచ్చారని సీఎం ఆరా తీసినట్టు సమాచారం. ఈ క్రమంలో బుక్ మై షో నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త సంవత్సరం వేళ ఈవెంట్స్ కోసం సంస్థలు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని పోలీసులు వెల్లడించారు. నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
సన్‌బర్న్ అనేది అతిపెద్ద మ్యూజికల్ ఈవెంట్. డిసెంబర్ 31న మాదాపూర్ లో ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. సుమంత్ అనే వ్యక్తి సన్ బర్న్ పేరిట ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులకు కొంత డబ్బు చెల్లించారని తెలుస్తోంది. అనంతరం అనుమతుల కోసం పోలీసులకు ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
కానీ ఈలోగా అనుమతులు రాకుండానే బుక్ మై షోలో టికెట్లు విక్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇది ఇలా వుంటే ఈ ఈవెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈవెంట్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అయినట్టు తెలిపారు.
గతంలో శంషాబాద్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకల్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కానీ ఆ యువకుడి ముఖంపై గాయాలయ్యాయని, చెవుల నుంచి రక్తం కారిందని మృతుని సోదరుడు ఆరోపించారు. ఆ తర్వాత 2017లో ఈ ఈవెంట్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. ఆ తర్వాత ఈ వేడుకపై పలు ఆరోపణలు వచ్చాయి.