ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు (Manish Sisodia) షాక్ తగిలింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఆయన మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండనున్నారు.
మరోవైపు ఈ కేసులో దర్యాప్తును ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒక వేళ విచారణ నత్త నడకన సాగితే మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిసోడియాకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం అవకాశం కల్పించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణల నేపథ్యంలో మనీశ్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. లిక్కర్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఆయన ఫిబ్రవరి 28న కేబినెట్ నుంచి తప్పుకున్నారు. మొత్తం 18 మంత్రిత్వ శాఖలకు ఆయన రాజీనామా చేశారు.
ఈ స్కామ్ కు సంబంధించి ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. అందులో మొదటి కేసును సీబీఐ దాఖలు చేసింది. ఆ తర్వాత సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సిసోడియాపై ఈడీ నమోదు చేసింది.