ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఈడీ కస్టడీ(ED Custody)లో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) వేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు(SUPREME COURT) శుక్రవారం విచారణ జరిపింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, తప్పుడు ఆరోపణలు, విచారణ పేరిట ఈడీ తనను వేధిస్తోందని కవిత తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
కవిత పిటిషన్‌పై స్పందించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కవితకు సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ పిటిషన్ పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
ఇదిలాఉండగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సరిగ్గా వారం కిందట ఇదే రోజున(శుక్రవారం) సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను అదే రోజు రాత్రి విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. మరుసటి రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా .. మద్యం పాలసీ అవినీతి కేసులో కవిత పాత్రను గుర్తించిన న్యాయస్థానం ఆమెకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీని విధించింది.
ఈ క్రమంలోనే మార్చి 18న కవిత సుప్రీంలో తన అరెస్టును నిలుపదల చేయాలంటూ రిట్ పిటిషన్ వేసింది.తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పును వెలువరించింది. కాగా, లిక్కర్ కుంభకోణంలో గతరాత్రి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా నేడు సుప్రీంలో విచారణ జరగనుంది.