మహాత్మ గాంధీ (Mahatma Gandhi) జయంతి నేపథ్యంలో ప్రధాని (PM Modi) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ రెజ్లర్, రామ్ రామ్ సరెయానే ఫేమ్ అంకిత్ బైయన్ పురియాతో కలిసి ప్రధాని మోడీ శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
దేశం ఈ రోజు పరిశుభ్రత మీద ఫోకస్ చేసిందని ప్రధాని మోడీ అన్నారు. అంకిత్ బైయన్ పురియాతో కలిసి తాను పరిశుభ్రతకు మించి పనిలో ఫిట్నెస్, శ్రేయస్సు కూడా మిలితం చేశామన్నారు. ఇక గుజరాత్లో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులతో కలిసి చీపిరి పట్టుకుని అమిత్ షా వీధులను శుభ్రం చేశారు.
సీతాపూర్లో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ క్యాంపెయిన్లో యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. మరో వైపు ‘ చెత్త రహిత భారత్- పరిశుభ్రమైన భారత్’ అనే క్యాంపెయిన్ ను యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర సింగ్ చౌదరి ముందుండి నడిపించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మీనాక్షి లేఖీ పాల్గొన్నారు.
బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఇది ఒక జాతీయ స్థాయి కార్యక్రమని తెలిపారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని, ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఢిల్లీలోని చత్ ఘాట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ పాల్గొన్నారు.
మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛ సేవ చేశారు. ఇక హర్యానాలోని గురుగ్రామ్ లో నిర్వహించిన స్వచ్చతా కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. బంగాల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ముంబైలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.