సమాజ్ వాది పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ (Hindu)అనేది ఒక మతం (Religion) కాదని అన్నారు. హిందూ అనేది ఒక మోసం అని, కొంత మందికి అది వ్యాపారం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులం, మతంపై వివాదాస్పద వ్యాఖ్యలను నిషేధిస్తామని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఆ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్వామి ప్రసాద్ మౌర్య పాల్గొని మాట్లాడుతూ…. హిందూ అనేది ఒక మోసం అని మండిపడ్డారు. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విధానం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మోహన్ భగవత్ గతంలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. హిందు మతం అనేది లేదని ప్రధాని మోడీ అన్నారని తెలిపారు.
ప్రధాని మోడీ, మోహన్ మోహన్ భగవత్ లాంటి వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినవని ఎద్దేవా చేశారు. కానీ అదే వ్యాఖ్యలు స్వామి ప్రసాద్ మౌర్య చేస్తే అందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. 8 శాతం జనాభా గల వ్యక్తులు తమ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని చెప్పారు. దళితులు, ఓబీసీలు ఓట్ల కోసం హిందువులుగా మారారన్నారు.
ఎన్నికల అనంతరం వాళ్లు హిందువులుగా పరిగణించబడరన్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమను హిందువులుగా భావించి ఉంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల ప్రజల రిజర్వేషన్లను వారు ముగించే వారు కాదన్నారు. అందుకే హిందువు అంటే మోసమన్నారు. ఈ వ్యాఖ్యలకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ స్పష్టం చేశారు.