స్వామి శ్రద్ధానంద (Swami Shraddhanand)… హిందూ సంస్కరణ ఉద్యమంలో (Hindu Reforms Movement) పాల్గొని హిందూ మతంలో సంస్కరణల కోసం కృషి చేసిన గొప్ప యోగి. మహిళా విద్యను ప్రోత్సహించిన సంఘ సంస్కర్త. రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమంలో పాల్గొని కీలక పాత్ర పోషించిన దేశ భక్తుడు. ఢిల్లీలోని జామా మసీదు మినార్ల పైనుంచి ప్రసంగించిన ఏకైక వ్యక్తి ఈయనే.
1856 ఫిబ్రవరి 22న పంజాబ్ జలంధర్ లోని తల్వార్ గ్రామంలో జన్మించారు. తండ్రి లాలా నానక్ చంద్. తన జీవితంలో చూసిన కొన్ని ఘటనల నేపథ్యంలో నాస్తికుడిగా మారారు. పంజాబ్ యూనివర్శిటీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత యూపీలోని బరేలీలో స్వామి దయానంద సరస్వతిని కలిశారు.
అక్కడ దయానంద ప్రసంగాలతో స్ఫూర్తి పొంది ఆస్తికుడిగా మారారు. అనంతరం పంజాబ్ లో ఆర్య సమాజ్ శాఖను స్థాపించారు. 1897లో స్వామి లేఖ్ రామ్ హత్యకు గురయ్యారు. దీంతో ఆయన స్థానంలో పంజాబ్ ఆర్య ప్రతినిధి సభకు శ్రద్ధానంద నాయకత్వం వహించారు. ఆర్య ముసాఫిర్ అనే పత్రికను స్థాపించారు. హరిద్వార్ లో గురుకులాన్నీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరావళి, ఫరీదాబాద్, హర్యానాలో గురుకులాలను స్థాపించారు.
1917లో హిందూ సంస్కరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1919లో రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జలియన్ వాలా బాగ్ ఘటనను, రౌలత్ చట్టాలను వ్యతిరేకిస్తూ అమృత్ సర్ లో సమావేశం నిర్వహించాలని ఐఎన్సీ ఆహ్వానించింది. ఢిల్లీలోని చాందీని చౌక్ లో క్లాక్ టవర్ వద్ద రౌలత్ వ్యతిరేక ఉద్యమంలో బ్రిటీష్ సైనికుల తీరుపై నిరసన తెలిపారు.
జలియన్ వాలా బాగ్ ఘటనకు వ్యతిరేకంగా భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జామా మసీదు మినార్ల పైనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అస్పృశ్యుల గొప్ప, అత్యంత నిజాయితీ గల ఛాంపియన్ అని శ్రద్ధానందను బీఆర్ అంబేద్కర్ కొనియాడారు. 1926 డిసెంబర్ 23న శ్రద్ధానందపై అబ్దుల్ రషీద్ దాడి చేయడంతో ఆయన మరణించారు.