సనాతన ధర్మం ( Santhana Dharma) పై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ (BJP) వక్రీకరించిందని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ది కోసమే తన ప్రకటనను తప్పుదారి పట్టించిందని పేర్కొన్నారు. అందువల్లే తన ప్రకటనపై పెద్ద ఎత్తున వివాదం (Controversy) చెలరేగిందని చెప్పారు.
అటు ఉత్తరాది మీడియా కూడా తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేసిందని వివరించారు. మరో వైపు కేంద్రంపై ఉదయ నిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై మోడీ సర్కార్ వేధింపులకు దిగుతోందవని తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణ భారత్‌లోని రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం బలవంతంగా లాక్కొంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత విధానాల ప్రకారం నియోజక వర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం కలగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఎనిమిది సీట్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియకు మనం రెండేండ్ల దూరంలో వున్నామని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మన మంతా గళమెత్తాలని పిలుపు నిచ్చారు.
ఈ పోరాటంలో డీఎంకే ముందు నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవహారాల్లో తరుచుగా గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, పారిశ్రామిక రంగాలకే డీఎంకే సర్కార్ దృష్టి పెడుతోందని చెప్పారు. పేద పిల్లల విద్య కోసం పాలసీలు రూపొందించామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఐటీ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం తమిళనాడు అని అన్నారు.