పదేళ్ల చిన్నారి..పైగా బధిరురాలు తప్పిపోయింది.ఆ రోజునుంచి..కన్నవాళ్లు ఆ బాలికను వెతకటం కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు.ఎటుపోయిందో తెలియదు,ఎక్కడుందో తెలియదు.
కన్నవాళ్ల గుండెకేక బధిరురాలైన ఆ చిన్నారి చెవికి చేరకపోవచ్చు..కానీ ఆపై వాడు విన్నాడు. 20 యేళ్ల తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులను చేరింది..ఇన్నాల్లు ఎక్కడుంది.?! ఇప్పుడు తన వాళ్లను ఎలా చేరింది..!?
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు(Tamil Nadu)రాష్ట్రం ధర్మపురి జిల్లా(Dharmapuri District)పెన్నాగరం సమీపంలోని కెండయనళ్లి పుదూర్(Kendayanalli Pudur)కు చెందిన వెంకటాచలం, మాతమ్మాళ్ దంపతుల కుమార్తె రమ్య బధిరురాలు.
దాంతో ఆమెను ప్రైవేట్ బధిరుల పాఠశాలలో చేర్చారు.ఈ క్రమంలో 2002లో పాఠశాల తరఫున రమ్య రైల్లో కర్ణాటక టూర్కు వెళ్లింది. అక్కడ పర్యాటక ప్రదేశాలను చూపించడానికి స్కూల్ వాళ్లు పిల్లలను తీసుకెళ్లారు.
అయితే, ఆ టూర్లో రమ్య తప్పిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు అన్ని విధాలుగా వెతికినా జాడ దొరకలేదు. ఈ క్రమంలో ధర్మపురి జిల్లాకు చెందిన బధిరురాలు ముంబై(Mumbai)లో ఉన్నదని చెన్నైలోని బధిరుల సంస్థకు ఓ మహిళ ఫొటో పంపింది.
ఆ ఫొటోను బధిరుల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా పలు సోషల్ మీడియా గ్రూప్స్ లో పోస్ట్ చేసింది.దాంతో ఆఖరికి రమ్య తల్లిదండ్రుల వరకు ఆ ఫొటో చేరింది. ఆ మహిళ తమ కుమార్తె కావచ్చని భావించి ఆమె తల్లిదండ్రులు సదరు సంస్థను సంప్రదించారు.
అక్కడికి వెళ్లిన తర్వాత చేతికి ఉన్న పచ్చ బొట్టును చూసి తమ కుమార్తేనని నిర్ధారించారు.బధిరుల సంస్థ నిర్వాహకులు మహారాష్ట్రలోని పుణెలో ఉన్న సంస్థ వారిని సంప్రదించి రమ్యని చెన్నైకి రప్పించారు. అనంతరం ధర్మపురిలో ఆమెను తన కుటుంబానికి అప్పగించారు.