మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) ప్రధాన కార్యదర్శి వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE)చీఫ్ వేలు పిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారని అన్నారు. ఎల్టీటీఈ చీఫ్ జయంతి సందర్బంగా కేక్ కోసి ప్రభాకరన్ జన్మదిన వేడుకలను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఎల్టీటీఈ వేలు పిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే తాము ప్రభాకరన్ పుట్టినరోజున కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభాకరన్తో పాటు ఉన్న పజా నెడుమారన్, కాశీ ఆనందన్ వంటి వ్యక్తులు అబద్దం చెప్పరని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళ జాతీయ వాది పళ నెడు మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని అన్నారు. ప్రభాకరన్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే ప్రజల ముందుకు ప్రభాకరన్ వస్తారంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
మరో వైపు తమిళ నేత కాశీ అనందన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రభాకరన్ ఇంకా జీవించి ఉన్నాడని వెల్లడించారు. ఒక వేళ ప్రభాకరన్ నిజంగా చనిపోయి ఉంటే శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ మరణం గురించి పత్రాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. అందుకే ప్రభాకరన్ బతికే ఉన్నారని తాము నమ్ముతున్నామన్నారు.