తాంతియా తోపే (Tantia Tope) … సిపాయిల తిరుగుబాటు (Indian Rebellion of 1857) కాలంలో అత్యంత కీలకమైన వ్యక్తి. బ్రిటీష్ కుట్రలకు తన వ్యూహాలతో చెక్ పెట్టిన గొప్ప వ్యూహకర్త ఆయన. బ్రిటన్ సేనలు హస్త గతం చేసుకున్న కాన్పూర్, గ్వాలియర్ నగరాలను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. తన గెరిల్లా యుద్ద విద్యలతో బ్రిటీష్ సేనలను అల్లాడించిన గొప్ప యుద్ధ వీరుడు.
1814లో నాసిక్ లోని యవాలే అనే గ్రామంలో తాంతియా తోపే జన్మించారు. తాంతియా తోపే అసలు పేరు రామ చంద్ర పాండు రంగా రావు. తండ్రి పేరు పాండురంగ పంత్. తల్లి పేరు రుక్మిణీ భాయి. రెండవ బాజీరావు పీష్వా ఆస్థానంలో పాండు రంగ పంత్ కీలకమైన పదవిలో ఉన్నారు. చిన్న తనంలోనే రామచంద్ర తన తెలివి తేటలతో బాజీరావు దృష్టిని ఆకర్షించారు.
బాజీరావు మరణాంతరం ఆయనకు ఇచ్చిన అన్ని భరణాలను బ్రిటీష్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ క్రమంలో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు ప్రకటించారు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో నానా సాహెబ్ కు ముఖ్య సలహాదారునిగా తాంతియా తోపే పని చేశారు. ఆ సమయంలో బ్రిటన్ సేనలు కాన్పూర్ ను హస్త గతం చేసుకున్నాయి. దీంతో గ్వాలియర్ దళాలతో కలిసి బ్రిటీష్ వారిపై తాంతియా తోపే యుద్దానికి దిగాడు. తాంతియా తోపే గెరిల్లా దాడులకు చెల్లాచెదురైన బ్రిటీష్ సేనలు తోక ముడిచి కాన్పూర్ నుంచి వెళ్లి పోయాయి.
పరాజయాన్ని తట్టుకోలేని బ్రిటీష్ సేనలు మరో సారి బ్రిటీష్ అధికార జనరల్ సిరిల్ నేతృత్వంలో కాన్పూర్ పై మరోసారి దాడి చేశాయి. బ్రిటీష్ దాడిని చాకచక్యంగా తిప్పి కొట్టిన తాంతియా తోపే మరోసారి కాన్పూర్ ను రక్షించాడు. ఆ తర్వాత క్యాంప్ బెల్ సేనలు మరోసారి దాడి చేసి కాన్పూర్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో తాంతియా, అతని అనుచరులు ఝాన్సీ రాజ్యంలో తలదాచుకున్నారు.
ఆ తర్వాత ఝాన్సీ రాజ్యంపై బ్రిటీష్ సేనలు దాడి చేయగా లక్ష్మీ బాయికి ఆయన అండగా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీ బాయితో కలిసి గ్వాలియర్ కోటను తమ ఆధీనంలోకి తీసుకుని దానికి హైందవీ స్వరాజ్ అని పేరు పెట్టారు. అనంతరం 1857 తిరుగుబాటును బ్రిటీష్ సేనలు అణచి వేశాయి. దీంతో అడవుల్లో నుంచి బ్రిటీష్ వారిపై దాడులు కొనసాగించారు. రాజ నర్వార్ నమ్మక ద్రోహంతో తాంతియా గురిచి బ్రిటీష్ వారికి సమాచారం అందిచారు. తాంతియాను అరెస్టు చేసి బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధించింది.