దేశ వ్యాప్తంగా యాపిల్ ఫోన్ల ( Apple Phones) హ్యాకింగ్ వార్త కలకలం రేపుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. విపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీ నేతలకు యాపిల్ కంపెనీ నుంచి హెచ్చరికలు వచ్చాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లకు కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంత ట్యాపింగ్ చేయాలనుకుంటే అంత చేసుకోవచ్చని అన్నారు.
తమ పార్టీ ముఖ్య నేతలైన కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా, సుప్రీయా శ్రీనాథ్‌ల యాపిల్ కంపెనీ నుంచి హెచ్చరికలు వచ్చాయని తెలిపారు. వారితో పాటు సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కు కూడా హెచ్చరికలు వచ్చాయన్నారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సీపీఎం నేత సీతారాం ఏచూరీ, ఎంపీ శశి థరూర్ కు సైతం యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్ వచ్చిందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నందున దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓర్వలేకపోతోందన్నారు. అందుకే ఇలా విపక్షాలను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్‌లకు చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.
ఈ రోజు ఉదయం పలువురు విపక్ష ఎంపీలకు యాపిల్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఫోన్ హ్యాకింగ్ అలర్ట్ రావడంతో తమన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ విపక్ష ఎంపీలు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ విషయంపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా నేరుగా ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు.