టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ పై అసెంబ్లీ సాక్షిగా నిరసన గళం వినిపించారు టీడీపీ (TDP) నేతలు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పైకి పేపర్లు విసురుతూ నిరసన తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని కేకలు వేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath) తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ తో పాటు ఇంకా చాలా అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బుగ్గన. స్పీకర్ ముందున్న మానిటర్ లాగేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి (Kotamreddy) ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు.
అంబటి మాట్లాడుతుండగా రండి చూసుకుందాం అంటూ బాలకృష్ణ (Balakrishna) మీసం తిప్పారు. దమ్ముంటే రా చూసుకుందాం అంటూ రాంబాబు సవాల్ చేశారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ (YCP) సభ్యులు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బాలకృష్ణ సైగలతో ఒక్కసారిగా ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు.. ఆయనకు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ వాయిదా పడింది.