టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ అక్రమమని ఏదోలా ప్రూవ్ చేసేందుకు ఆపార్టీ నేతలు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వెబ్ సైట్ ప్రారంభించగా.. అందులో పథకానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందుబాటులో ఉంచారు. అలాగే, ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. అయితే.. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) దీక్షకు దిగగా.. పోలీసులు (Police) భగ్నం చేశారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట వద్ద దీక్షా శిబిరం వద్దకు వెళ్లి బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సునీత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ఆమె మండిపడ్డారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సునీతకు లోబీపీ ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో వెంటనే వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
ఇక, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించడంతో గుంటూరు జిల్లా చింతలపూడిలో అడ్డుకున్నారు పోలీసులు. అక్కడకు వెళ్లేది లేదంటూ బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు ధూళిపాళ్లను అక్కడి నుంచి పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను చూడాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు నరేంద్ర. చంద్రబాబు అరెస్టులో అక్రమమే లేకుంటే నిజంగా స్కామ్ జరిగి ఉంటే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. అక్కడ ఎలాంటి అక్రమాలు అవినీతి జరగలేదు కాబట్టే ఇంత మంది పోలీసు బలగాలతో ప్రజల స్వేచ్ఛను హరించి నిజాలను పాతి పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. వాస్తవాలు ఎంత దాచిపెట్టినా దాగవన్న ఆయన.. ఏది నిజమో ఏది అబద్దమో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు నరేంద్ర.