ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) నిన్న ఉదయం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం (Skill Development case) కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడుని సీడీఐ (CID) అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి.
అయితే ఈలోపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా చేశారంటూ…గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే వారికి శనివారం అపాయింట్ మెంట్ ఇచ్చినా కూడా ఆ తర్వాత అది ఇవాళ్టికి (ఆదివారం) వాయిదా పడింది. దీంతో మళ్లీ ఇవాళ ఉదయం పది గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు టీడీపీ నాయకులు చెప్పారు.
నిన్న ముందస్తు అరెస్టుల పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకున్న నగరానికి చెందిన టీడీపీ నాయకులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, గణబాబు ఇతర నాయకులను నిన్న అర్థరాత్రి విడుదల చేశారు. వీరంతా కలిసి కాసేపట్లో గవర్నర్ ను కలవనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమని, అలాగే ప్రీవెన్షన్ అరెస్టుల పేరుతో టీడీపీ నాయకులందర్ని అరెస్ట్ చేయడంపై గవర్నరు ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు.
మరో వైపు గవర్నర్ చెప్పకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని అరెస్ట్ చేయడంపై కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు టీడీపీ నాయకులు గంటా శ్రీనివాసరావు అన్నారు.