Telugu News » AP Assembly : టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

AP Assembly : టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక జారీ చేశారు. సభలో మీసాలు మెలివేయడం, తొడగొట్టడం వంటి రెచ్చగొట్టే పనులు పద్దతి కాదన్నారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని తొలి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పారు.

by admin
TDP MLAs Suspended For Assembly Session

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ (TDP) నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొందర్ని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయగా.. మరికొందర్ని ఒకరోజు సమావేశాలకు రాకూడదని స్పష్టం చేశారు.

TDP MLAs Suspended For Assembly Session

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ పై అసెంబ్లీ సాక్షిగా నిరసన గళం వినిపించారు టీడీపీ (TDP) నేతలు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పైకి పేపర్లు విసురుతూ నిరసన తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని కేకలు వేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath) తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో పాటు ఇంకా చాలా అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

స్పీకర్ ముందున్న మానిటర్ లాగేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి (Kotamreddy) ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. ఆయన మాట్లాడుతుండగా రండి చూసుకుందాం అంటూ బాలకృష్ణ (Balakrishna) మీసం తిప్పారు. దమ్ముంటే రా అంటూ రాంబాబు కూడా సవాల్ చేశారు. మీసాలు తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలంటూ బాలకృష్ణకు కౌంటర్‌ ఇచ్చారు.

వైసీపీ (YCP) సభ్యులు కూడా పోటాపోటీగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలకృష్ణ సైగలతో ఒక్కసారిగా ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు.. ఆయనకు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ వాయిదా పడింది. తిరిగి ప్రారంభం అయ్యాక కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్.

వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక జారీ చేశారు. సభలో మీసాలు మెలివేయడం, తొడగొట్టడం వంటి రెచ్చగొట్టే పనులు పద్దతి కాదన్నారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని తొలి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ఇక, అనగాని ప్రసాద్‌, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, పయ్యావుల కేశవ్‌ ను ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేశారు స్పీకర్. మిగతా టీడీపీ సభ్యులందరిపై ఒకరోజు సస్పెషన్ వేటు వేశారు. అయితే, లాబీల్లో కూడా నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. సీఎం వైఎస్‌ జగన్‌ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. బెందాళం అశోక్, బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య మాటామాటా పెరిగింది.

You may also like

Leave a Comment