ఏపీ అసెంబ్లీ సమావేశాల(AP Assembly) రెండోరోజు వాడీవేడీగా జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు (CBN Arrest)అక్రమం అనే అంశంపై చర్చకు తెలుగుదేశం(TDP) పట్టుబట్టనుంది. అధికారపక్షం ఎంత దుందుడుకుగా వ్యవహరించినా వెనక్కి తగ్గకూడదని, శాసనమండలిలోనూ ఇలాగే వ్యవహరించాలని నిర్ణయింది.
స్కిల్ డెవల్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు ప్రభుత్వానికి స్పీకర్ అనుమతిస్తే… తమకూ అవకాశం ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టనుంది. చంద్రబాబును తక్షణం విడుదల చేసి, సీఎం జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలనే అజెండాతోనే రెండో రోజూ శాసనసభ, మండలికి తెలుగుదేశం నేతలు రానున్నారు.
స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని సభలో లెవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది.వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని టీడీపీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేస్తున్నారు.
సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ… టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని మండిపడ్డారు. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సభలోకి వచ్చిన వెంటనే గోల చేస్తున్నారని మండిపడ్డారు. వయసుకు తగ్గట్టుగా టీడీపీ సభ్యులు వ్యవహరించడం లేదని అన్నారు.