Telugu News » Teachers : టీచర్లు ఎక్కడ..? ఇదేనా బంగారు తెలంగాణ..?

Teachers : టీచర్లు ఎక్కడ..? ఇదేనా బంగారు తెలంగాణ..?

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 11,348 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈమధ్యే కేంద్రం వెల్లడించింది.

by admin
teachers-shortage-in-telangana

నీళ్లు, నిధులు, నియామకాల కోసం నినదించిన నేల. సకలజనులు ఏకమై పోరాడి సాధించుకున్న తెలంగాణ (Telangana). మరి, ఆనాటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయి? ప్రతిపక్షాలను ఈ మాట అడిగితే ముమ్మాటికీ లేదనే అంటున్నాయి. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ (KCR).. ఉద్యోగాలు ఇవ్వడం లేదు, టైమ్ కి జీతాలు వేయడం లేదు, రైతు బంధు ఇచ్చి సబ్సిడీలు ఎత్తివేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని వివరిస్తున్నాయి. ముఖ్యంగా టీచర్ (Teacher) పోస్టుల అంశంలో కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు టెట్‌ రాసి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో తొలి టెట్‌ 2016 మే 22న జరిగింది. పేపర్‌-1కు 88,158 మంది హాజరు కాగా 48,278 మంది పాసయ్యారు. పేపర్‌-2ను 2,51,924 మంది రాయగా 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో టెట్‌ 2017 జులై 23న నిర్వహించారు. పేపర్‌-1ను 98,848 మంది రాయగా 56,708 మంది పాసయ్యారు. పేపర్‌-2కు 2,30,932 మంది హాజరుకాగా 45,045 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడో టెట్‌ 2020 జూన్‌ 12న జరిగింది. పేపర్‌-1కు 3.18 లక్షల మంది హాజరు కాగా 1,04,578 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-2ను 2,50,897 మంది రాయగా 1,24,535 మంది పాసయ్యారు.

రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు రిటైర్డ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ, వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందనేది విపక్ష నేతల ఆరోపణ. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని.. వారిలో కొందరి వయో పరిమితి కూడా దాటిపోతోందని అంటున్నారు. 2020 డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా టీచర్‌ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారు కేసీఆర్. కానీ, ఆ హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని మండిపడుతున్నారు. ఆఖరికి డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ధర్నాలతో రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాలా స్కూళ్లలో టీచర్లు లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. ప్రధానంగా హైస్కూళ్లలో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. కొందరైతే దూరమౌతున్న పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైమరీ స్కూళ్లలో ఎస్జీటీ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. సింగిల్ టీచర్ ఉన్న స్కూల్లో వారు లీవ్ పెడితే స్కూల్ ను బంద్ చేసే పరిస్థితి. చాలాచోట్ల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో హెడ్ మాస్టర్ లేకపోవడంతో స్కూళ్ల నిర్వహణకు ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు

మెదక్ జిల్లాలో 628
సిద్దిపేట జిల్లాలో 650
సంగారెడ్డి జిల్లాలో 910
కామారెడ్డి జిల్లాలో 856
ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ఖాళీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 11,348 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈమధ్యే కేంద్రం వెల్లడించింది. మొత్తం 97,710 పోస్టులకుగాను 86,362 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిపింది.

You may also like

Leave a Comment