భారత్ మరి కొన్ని నెలల్లో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని ప్రధాని మోడీ (PM MOdi) వెల్లడించారు. చంద్రుని (Moon) పై భారత జెండా (Indian Flag)ను ఎగుర వేశామని గుర్తు చేశారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా యువత కొత్త ఆలోచనలు చేయాలన్నారు. యువతపై ఈ దేశానికి, ప్రభుత్వానికి చాలా ఎక్కువ అంచనాలు వున్నాయన్నారు.
రోజ్ గార్ మేళాలో భాగంగా సుమారు 51 వేల మంది నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను ప్రధాని మోడీ వర్చువల్ గా అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…. ఉత్పత్తులు, ఎగుమతుల్లో భారత్ దూసుకు పోతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందన్నారు.
భారత్ ఇటీవల చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. కొద్ది రోజుల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో అనూహ్యమైన ఓటింగ్‌తో ఉభయ సభల్లో ఆమోదం పొందిందన్నారు. దీంతో దశాబ్దాల కల నెరవేరిందన్నారు. దేశంలో మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు.
ఈ దేశంలో మార్పు కోసం మన ఆడపడుచులు కవాతు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. ఇంతకుముందు, ప్రజలు రైలు టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు క్యూలో నిలబడేవారన్నారు. కానీ ఇప్పుడు బుకింగ్ లన్నీ ఆన్ లైన్ లో చేసుకోవచ్చన్నారు.
ఆధార్ కార్డ్‌లు, ఈ కేవైసీ, డిజీ లాకర్ ఈ దేశంలో డాక్యుమెంటేషన్ ను చేసే విధానాన్ని పూర్తిగా మార్చేశాయన్నారు. సాంకేతికత అనేది అవినీతిని, సంక్లిష్టతను తగ్గించి విశ్వసనీయత సౌకర్యాన్ని పెంపొందించడానికి సహాయపడిందన్నారు. ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వ విధానాలను మిషన్ మోడ్ లో అమలు చేశామన్నారు. ప్రభుత్వ విధానాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచామన్నారు.