కశ్మీర్ వేర్పాటు వాద పార్టీ తెహ్రీక్-ఏ-హురియత్ (Tehreek-e-Hurriyat)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) నిషేధం (Ban) విధించింది. భారత్ కు వ్యతిరేకంగా తెహ్రీక్ హురియత్ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది.
ఈ పార్టీని చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ చట్టం)కింద ఆ సంస్థను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు.
భారత్ నుంచి కశ్మీర్ విడగొట్టి అక్కడ ఇస్లాం పాలన తీసుకు రావాలని తెహ్రీక్-ఏ-హురియత్ సంస్థ ప్రయత్నిస్తోందని కేంద్రం వెల్లడించింది.
ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తూ కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ క్రమంలోనే సంస్థపై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తోందనే ఆరోపణలపై ఈ సంస్థపై చాలా కాలంగా కేంద్రం నిఘా పెట్టింది.
జమ్ములో ఉగ్రవాదాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు గతంలో దివంగత వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించాడు. ఏ వ్యక్తి, సంస్ధ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు.
ఇటీవల జాతి వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ముస్లిం లీగ్ జమ్ము కశ్మీర్ (మసరత్ ఆలం వర్గం) ఎంఎల్‌జేకే(ఎంఏ)లపై నిషేధం విధించింది. జమ్ము కశ్మీర్‌లో ఇస్లామిక్ పాలన ఏర్పాటు దిశగా ప్రజలను ఈ సంస్ధ రెచ్చగొడుతోందని కేంద్రం గుర్తించింది.