కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ను (KCR) కాంగ్రెస్ (Congress) సర్కార్ కాపాడుతోందని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఫామ్ హౌజ్‌లో కేసీఆర్, ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ఉందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. మీరు మాజోలికి రావద్దు.. మేము మీ జోలికి రాబోమని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ….. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గురించి సీబీఐ విచారణ కోరుతు కేంద్రానికి కాంగ్రెస్ ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అనేది కేసీఆర్ చేసి అతి పెద్ద స్కామ్ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోనిదే కాళేశ్వరం పై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దంటూ గతంలో బీఆర్ఎస్ సర్కార్ చట్టాని తీసుకు వచ్చిందన్నారు.
ఇప్పడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ చట్టాన్ని తీసివేసి దర్యాప్తు చేస్తుందా? లేదా బీఆర్ఎస్‌ను కాపాడుతుందా? అని ప్రశ్నించారు. .కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేవలం 48 గంటల్లో కేంద్రం సీబీఐతో విచారణ జరిగేలా రికమండ్ చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు రాష్ట్ర మంత్రులు వెళ్లారని చెప్పారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారని అన్నారు. కానీ ఏం చేయాలో కనీస అవగహాన లేకుండా పోయినట్టు కనిపిస్తోందన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి కేసీఆర్ ను ఆహ్వానించారో లేదో తనకు తెలియదన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.
నలుగురు సిట్టింగులకు ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అని వార్తలపై ఆయన స్పందించారు. అసలు ఆ విషయం ఎవరు చెప్పారని అడిగారు. ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగకు టికెట్ అంటూ బేస్ లెస్ వార్తలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఆ ప్రచారం సరికాదన్నారు. ఎన్నికల కమిటీ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు వస్తున్నారని వెల్లడించారు. జిల్లా అధ్యక్షుల మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.