కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) రెండూ కుటుంబ పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేనని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని చెప్పారు. కేంద్రంలో వచ్చేది మళ్లీ మోడీ ప్రభుత్వమేనని వెల్లడించారు.
గచ్చిబౌలిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ…. తమ తమ బూత్ పరిధిలో తామే గెలవాలన్న కసితో నాయకులు, కార్యకర్తలంతా పనిచేయాలని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికతో పనిచేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కప్పిపుచ్చాలని కాంగ్రెస్ చూస్తోందని పేర్కొన్నారు.
కాళేశ్వరంపై దర్యాప్తునకు తాము సిద్ధమని సీబీఐ చెబుతోందని తెలిపారు. కానీ సీబీఐ విచారణకు కాంగ్రెస్ ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఒకటేనని దీని ద్వారా అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని స్పష్టం చేశారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని వివరించారు.
తొమ్మిదిన్నరేండ్లలో లక్షల కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టులు సహా ట్రైబల్ వర్సిటీ, పసుపుబోర్డు, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలలి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.