– తెలంగాణ బీజేపీ సైలెంట్ స్కెచ్
– గెలుపు వ్యూహాల్లో నేతలు బిజీబిజీ
– 27న అమిత్ షా సభ
– ఆరోజు నుంచే ఎన్నికల శంఖారావం
– రంగంలోకి సరిహద్దు రాష్ట్రాల నేతలు
– వచ్చేనెలలో అభ్యర్థుల తొలి జాబితాకు ఛాన్స్
రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. సీఎం కేసీఆర్ (CM KCR) అభ్యర్థులను ప్రకటించేసి.. జిల్లాల బాట పట్టారు. కాంగ్రెస్ (Congress) కూడా అభ్యర్థులపై ఫోకస్ పెట్టి దరఖాస్తులు తీసుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు నెల రోజుల యాక్షన్ ప్లాన్ కు శ్రీకారం చుట్టింది. మరి.. బీజేపీ (BJP) పరిస్థితేంటి..? ఏం చేస్తోంది..? అని ఆపార్టీ నేతలను అడిగితే.. షాకింగ్ విషయాలను చెబుతున్నారు. అభ్యర్థులను ఖరారు చేసుకుని.. సైలెంట్ గా ఇన్ సైడ్ వర్క్ చేస్తోందని అంటున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా పక్కా ప్లాన్ తోనే ముందుకెళ్తున్నామని వివరిస్తున్నారు. అమిత్ షా (Amit shah) సభతో యాక్షన్ లోకి దిగుతామని అంటున్నారు.
అధికారంలో ఉన్న కర్ణాటకను చేజార్చుకున్న తర్వాత బీజేపీ తెలంగాణ (Telangana) పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం వాడుతున్న తీరును వివరిస్తూ ఇప్పటికే నేతలు జనంలోకి వెళ్తున్నారు. అయితే.. ఈ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకునే ప్లాన్ చేశారు. ఓవైపు బూత్ కమిటీలను బలోపేతం చేసుకుంటూనే.. ఇంకోవైపు సమావేశాలు, సభలతో ఈ 3 నెలలు పక్కా గెలుపు వ్యూహాలని అమలు చేయాలని చూస్తున్నారు.
ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో అమిత్ షా సభ జరగనుంది. దీని తర్వాత గేర్ మార్చాలని డిసైడైంది బీజేపీ అధిష్టానం. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఖమ్మం వేదికగా అమిత్ షా పలు కీలక ప్రకటనలు సైతం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే మిగతా రాష్ట్రాలనుంచి బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో వీళ్లిచ్చే రిపోర్టులు కూడా కీలకం కాబోతున్నాయని సమాచారం. తెలంగాణతో సరిహద్దు కలిగి ఉన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలకు హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ రెండో వారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు, సోషల్ మీడియాను కూడా గట్టిగా వాడేయాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ఇళ్లు తక్కువే. ఈ నేపథ్యంలో అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లో పార్టీ ప్రచారం, ప్రభుత్వ వైఫల్యాలను వివరించే పోస్టర్లు, ప్రత్యేక వీడియోలను రూపొందించి ప్రమోట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే దీనిపై ఫోకస్ పెట్టిన నేతలు ఆ పనిలో ఉన్నారు.