లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha) మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించుకునేందుకు తెలంగాణ బీజేపీ(Telangana BJP) సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్ర అధిష్టానం సూచనల మేరకు ఈసారి ఎలాగైనా అధికార పార్టీ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నది. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో 12కు పైగా ఎంపీ స్థానాలు గెలవాలని టీబీజేపీకి టార్గెట్ విధించారు.
దానిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర నాయకత్వం కమ్యూనిటీల వారీగా ఓటర్లకు (Community Voters) దగ్గరవ్వాలని నిర్ణయించింది. ఏ వర్గానికి చెందిన ఓటు బ్యాంకునూ ఈసారి వదులుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యింది. అందుకే ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఒక ఇన్‌చార్జిని నియమించాలని డిసైడ్ అయ్యింది. ఆ బాధ్యతలను ఆయా మోర్చాలకు అప్పగించింది.
పార్లమెంట్ ఇన్‌చార్జిలు ఒక్కొక్కరు తమకు అప్పగించిన సెగ్మెంట్లలో ఆయా కమ్యూనిటీకి చెందిన కనీసం 5వేల మందిని కలిసి కేంద్రంలోని బీజేపీ అందించే పథకాలు, చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేయనున్నారు. ఆ కమ్యూనిటీలో మేధావులు, మహిళలు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులను కలవాలని ముందుగా నిర్ణయించారు.
వారి ఓటు ఎలాగైనా బీజేపీకి పడేలా చూడాలని రాష్ట్ర నాయకత్వం నుంచి ఇంచార్జిలకు ఆదేశాలు ఉన్నాయి. ఇక క్షేత్రస్థాయిలో ఇన్ చార్జిలు ప్రజలను కలుస్తున్నారా? లేదా? అనేది తెలుసుకోవడానికి ప్రతి ఆరు పార్లమెంట్ సెగ్మెంట్లకు కలిపి ఒక జోనల్ ఇన్‌చార్జిని నియమించనున్నారు. వీరు కమ్యూనిటీ ఇన్‌చార్జిల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని హై కమాండ్‌కు పంపించనున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎస్సీ మోర్చా ఇన్‌చార్జిలను నియమించింది. త్వరలోనే అనుబంధ విభాగాలకు సైతం నియమించనున్నది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వగా రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతల తాకిడి పెరుగుతున్నది.
అయితే, ప్రచార సమయంలో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు సభలు సక్సెస్ చేయాలని పార్టీ నిర్ణయించింది. దీనిపై ఈనెల 21న పార్లమెంట్ అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, పార్లెమెంట్ ఇన్‌చార్జిలు, రాష్ట్ర పధాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ చీఫ్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కొనసాగనున్నది.